కాసిరెడ్డి నాయన..రాయలసీమ..
రాయలసీమ లో నిస్యబ్ధ విప్లవంలా సాగే నిత్యన్నదానం గురించి తెలుసుకోండి..
సరిగ్గా నాలుగేళ్ల క్రితం.. మహాశివరాత్రి నాటి ఓ నదీయాత్రను గుర్తు చేసుకుంటున్నాను.
ఓంకారం..
ఓంకారం ఒక నాదం, ఒక స్వరం, ఒక నమ్మకం, ఒక భక్తి సంకేతం అని మాత్రమే అప్పటివరకూ తెలుసు. ఓంకారం పేరుతో ఒక ఊరు వుందని, అక్కడో శివాలయం వుందని అప్పుడే తెలుసుకున్నా. నంద్యాలకు సమీపంలో వుంటుంది. ఓంకారం ఆలయాన్ని దర్శించడం, శివలింగాన్ని నుదుటితో ముద్దాడడం అనిర్వచనీయ ఆనందాన్ని ఇచ్చింది. అక్కడినుంచి ఎగువకు.. ఆ చీకట్లో అటవీమార్గంలో.. కొండ శిఖరంలోని శ్రీకూర్మపీఠం చేరడం.. అక్కడినుంచి మరో కొండపైకి చేరి వేంకటేశ్వరస్వామి, దుర్గమ్మలను దర్శించడం మర్చిపోలేని అనుభవం. మా ఇంట్లో కుక్కపిల్ల వచ్చి నిద్రలేపినట్టుగా.. శ్రీకూర్మపీఠంలో ఎలుగుబంటి వచ్చి నిద్రలేపి అన్నం పెట్టమని అడగడం... నిజంగా ఆశ్చర్యం కలిగించింది.
అదే ఊపులో కైలాస కోన, , జ్యోతి, సర్వ నరసింహ స్వామి, సత్యవోలు, సింగరకొండ, భైరవకోన,ఘటిక సిద్దేశ్వరం, ముడుమాల, బ్రహ్మంగారి మఠం, అహోబిలం, మహానంది.. ఇలా సుడిగాలి పర్యటన చేశాం.
1994-96 మధ్యకాలంలో కాశినాయన అనే అవధూతను కలుసుకోవాల్సిన సందర్భం వచ్చింది.. కానీ మిస్సయ్యాను ఆ మీటింగ్. నాలుగేళ్ల క్రితం మహాశివరాత్రినాడు ఆ అవధూతను పరోక్షంగా కలుసుకున్నా. నిజం చెప్పాలంటే ప్రత్యక్షంగా చూసినట్టు అనిపించింది.
ఓంకారంలో ఆ అవధూత కాశినాయనను మొదటిసారి చూశా.. అన్నం రూపంలో. కర్నూలు, కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో... ఎక్కడికి వెళ్లినా అక్కడ అన్నం రూపంలో ప్రత్యక్షం అయ్యాడు కాశినాయన.
మీరు మాయాబజార్ సినిమా చూసే వుంటారు. వివాహ భోజనంబు పాటను అనేకసార్లు వినే వుంటారు. అది సినిమా. డైరెక్టర్ ఏమైనా సృష్టించగలడు. అది సినిమా.. పైగా ఘటోత్కచుడి ప్రియశిష్యులు తమ మాయాజాలంతో ఏ వంటకాన్నయినా సృష్టించగల సమర్ధులు. అలాంటి మాయా సన్నివేశంలోని వంటకాలను దిగదుడుపు చేస్తూ.. వాస్తవ ప్రపంచంలో వండి వడ్డించే వంటకాలను.. ఒక్క కాశినాయన ఆశ్రమంలోనే చూడగలం.. రుచి చూడగలం. అది మాయాబజార్ కాదు. వాస్తవ ప్రపంచం. మనముందు వున్న వాస్తవ ప్రపంచం.
ఓంకారం వెళ్లినప్పుడు.. అక్కడ అన్నం వండేందుకు పేర్చిన డేగిశాలు చూసి మూర్ఛపోయినంత పనయింది. నిత్య అన్నదానం ఒక క్రతువు అక్కడ. పర్వదిన సందర్భంగా అన్నం, పప్పు, పాయసం, రోటి పచ్చడి, రసం, సాంబారు, వడియాలు, పెరుగు, నాలుగు రకాల మైసూర్ పాక్ లు, ఐదు రకాల కజ్జికాయలు, రొట్టెలు.. చెప్పుకుంటూ పోతే చాంతాండంత లిస్టు. ఒక్క ఓంకారంలోనే కాదు... ఇంకా అనేక చోట్ల ఇదే సీను. కాశినాయన సజీవ సమాధి అయిన జ్యోతిలో... ఒక దృశ్యం.. అచ్చెరువు గొలుపుతుంది. పాల క్యాన్ లు కాదు... ఏకంగా పాల వ్యాన్ వచ్చి వున్నదక్కడ. సిద్ధేశ్వరంలో.. ఘటిక సిద్ధేశ్వరంలో.. వేలాది మందికి అడిగినది లేదనకుండా వడ్డనలు. అడిగినవారికి అడిగినంత గడ్డపెరుగు.. మీగడ పెరుగు వడ్డనలు. అదే సిద్ధేశ్వరంలో ఉదయాన్న... ఇడ్లీలు, వడలు, పునుగులు, ఉప్మాలు, పకోడీలు, బజ్జీలు, పూరీలు, వెజ్ ఫ్రైడ్ రైస్ లు, పెరుగన్నాలు... లిస్టు చాలానే వుంది. ఎవరికి కావాల్సింది వారు తినేయవచ్చు.
దేవస్థానాల దగ్గర ఉచిత అన్నదాన శిబిరాలను చాలా చూశాను. కొన్ని చోట్ల తిన్నాను కూడా. కానీ ఎక్కడా ఇలా వుండదు. సాంబారు అన్నం మొహానకొట్టి... ఇదే మహాప్రసాదం అని భక్తులను చీదరించుకుంటూ వడ్డించే మహాన్నదానాలను కూడా చూసి వున్నాను. కానీ ఎక్కడా ఇలా.. ఇంత ప్రేమగా. ఇన్ని ఐటమ్స్ తో కొసరికొసరి వడ్డించే అన్నదానాన్ని నేనింతవరకూ చూడలేదు.
ఇంతటి మహాక్రతువు అవిచ్ఛిన్నంగా, అవిఘ్నంగా ఎలా జరిగిపోతున్నదో నాకైతే ఏమీ పాలుపోలేదు. దీనికి బాధ్యుడిగా వున్న వాడిని అడిగితే... వేలెత్తి పైకి చూపిస్తాడు.
నిజమే... మనిషి తలుచుకుంటే ఏమైనా సాధ్యమే. మనిషి అవధూతగా మారగలడు. అందుకు కాశినాయన నిలువెత్తు సాక్ష్యం.
వారికి సాష్టాంగ ప్రణామములు.
(అన్నట్టు.. కాశినాయన మీద తెలుగులో ఒక సినిమా కూడా వచ్చింది. గుమ్మడి ప్రధాన పాత్రధారి. గుమ్మడి నటించిన చివరి సినిమా కూడా అదే. ఆ సినిమా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే.. ఆ సినిమా ఆడింది.)
మున్నేల్లి రాజశేఖర్ రెడ్డి
No comments:
Post a Comment