*కాలప్రవాహం*
భగవంతుడి సృష్టి అపూర్వం. అందులో ఎప్పటికప్పుడు కొత్తదనం కనిపిస్తుంది. తాజాదనం నిండి ఉంటుంది. అలాగే, జీవితం పట్ల మనిషి దృక్పథంలోనూ మార్పు రావాలి. నిజానికి అతడి స్వభావమే చిత్రమైంది. ఇతరులతో సామాజిక సంబంధాల్లో తలెత్తే సమస్యలు, కేవలం అతడి స్వభావానికి సంబంధించినవే కావు. ఎదుటివారి స్వభావం తాను ఆశించినట్లే ఉండాలనుకోవడం అతడి అజ్ఞానం. అవతలి వ్యక్తి తనను యథాతథంగా అంగీకరించాలనుకునే మనిషి, అటు వైపు మార్పు కోరుతుంటాడు!
సంబంధాలతో ముడివడిన విషయాల్లో, పరిష్కారం రెండు విధాలుగా కనిపిస్తుంది. ఒకటి వ్యక్తిగతం, రెండోది పరాధీనం. ఏ విజయమైనా అవతలివారి వల్ల ప్రాప్తించినప్పుడు, హృదయపూర్వకంగా ‘ఇది మీ కారణంగానే సాధ్యపడింది’ అనాలి. అలాంటి అవకాశాన్ని ఎన్నడూ జారవిడవకూడదు. అదే, మన సంతోషాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది.
కాలాన్ని సక్రమంగా వినియోగించేందుకు, మొదట అవసరమయ్యేది క్రమశిక్షణ. దీనికి వేరే ఉపకరణాలు ఉండవు. ఏ సమయమైనా సమయమే! ‘ఎప్పుడైనా తప్పు లేదు, వీలును బట్టి’ అన్నట్లు దేన్నీ తేలిగ్గా తీసుకోకూడదు.
పొరపాటు దొర్లితే, ఆ తరవాత ప్రణాళికను సరిచేసుకుంటూ సాగిపోవాలి. పాత విషయాలనే పట్టుకొని ఉండిపోకూడదు. సంకల్పం పూర్తయ్యాక, లోటుపాట్లను విశ్లేషించుకోవాలి. మచ్చల్ని సైతం నక్షత్రాలుగా చూడగలగాలి. ప్రతిదీ ఒక అవకాశంగా తీసుకోవడం, ప్రణాళికను లోపరహితంగా మార్చుకోవడం ఎంతో ముఖ్యమైనవి. ఎప్పుడైనా తప్పటడుగులు పడటం సహజం. అది తప్పటడుగు అని గుర్తించి, అనంతరం జాగ్రత్తగా మసలుకోవడమే అనుసరణీయ పద్ధతి.
‘ఏదోవిధంగా బతికేస్తాను’ అన్నట్లు కాకుండా, ‘ఈ విధంగా జీవిస్తాను’ అనే పూర్తి విశ్వాసంతో ఉండటమే వివేకం గల మనిషి చేయాల్సిన పని.పాదరక్ష అడుగున ఒక చిన్న రాయి ఇరుక్కుంటే ఇబ్బంది అనిపిస్తుంది. దాన్ని తొలగించేవరకు వూరుకోం. అప్పుడే మనశ్శాంతి. చాలామంది ప్రతిరోజూ అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. పలు చిరాకుల మూలాన సంతోషం మాయమవుతుంటుంది. హాయిగా కాలం గడపడానికి ప్రశాంతత కావాలనిపిస్తుంది. మనిషి ఎక్కడికక్కడ చలించిపోకుండా, సరైన పరిష్కారం కనుగొంటూ సాగాలి. సమస్యలు సహజమనుకోవాలి.
పరిష్కరించుకోలేనివి ఏవీ ఉండవు. సమస్యలను స్వీకరించే విధానమే ముఖ్యం. అన్నింటికంటే ముఖ్యం ప్రశాంతత! కాలానుగుణంగా అన్నీ కొనసాగుతున్నా- అవి అర్థవంతంగా, నిర్మాణాత్మకంగా ఉండకపోతే జీవితాన్ని గడియారం శాసించినట్లు అవుతుంది. అంతే తప్ప, అది సమయపాలన అనిపించుకోదు. కాలం అనేది ఇతర అన్ని వనరుల వంటిదే. అది సృజనాత్మకతకు దోహదపడాలి. కాలం కరిగిపోవడమంటే, మనిషి తన జీవితాన్ని కోల్పోతున్నట్లు!
జీవితం ఒక నదిలాంటిది. దారిలో ఎన్నో రాళ్లూ రప్పలు ఉంటాయి. ప్రవాహం వాటిపై నుంచి, పక్క నుంచీ సాగిపోతుంటుంది. అలాగే కాలప్రవాహం కూడా! ఏ ఏడాదైనా సంతోషాన్ని అందించకుండా, సవాళ్లు విసరకుండా వెళ్లదు. సవాళ్లను ఎదుర్కోవడం, వాటిని అభివృద్ధికి అవకాశాలుగా మార్చుకోవడం మరీ అంత కష్టతరమేమీ కాదు. మొదట ఆ దిశగా మనిషి ఆలోచించాలి. కొత్త ప్రారంభానికి స్వాగతం పలకాలి!
No comments:
Post a Comment