Saturday, 2 June 2018

om kasinayana




ఆత్మ ప్రకాశము వల్ల, బుద్ధి ప్రతిఫలించి, ప్రకాశించి బుద్ధి కర్మానుసారణి అనే పద్ధతిలో, బుద్ధి కర్మల విషయంలో చేయాల్సిన విధంలో కర్మ అనుభవం వచ్చిన తరువాత దానిని ప్రియంగానో, అప్రియంగానో ఎలా స్వీకరించాలనే విషయాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయం చేసే జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆత్మ ఆత్మప్రకాశం యొక్క ప్రతిబింబించిన ప్రకాశం. ఇక్కడ ప్రకాశము అంటే జ్ఞానము. అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము యొక్క ప్రతిబింబ జ్ఞానమే బుద్ధి జ్ఞానము. శుద్ధ బుద్ధి అయితే రెండూ ఒక్కటే. ఆత్మప్రకాశము, బుద్ధి ప్రకాశము, బింబ, ప్రతిబింబ ప్రకాశములలో ఏ భేదము ఉండదు. కాని, బుద్ధి విషయాలతో కూడినప్పుడు. బుద్ధి ప్రకాశము విషయానుభవాన్ని ఇస్తుంది కానీ, ప్రకాశ అనుభవాన్ని ఇవ్వడం లేదు. ఈ రెండూ సూర్యరశ్మి ప్రకాశ మాత్రమున జరుగుచున్నాయి కాని, సూర్యరశ్మికి ఏ మాలిన్యము అంటటడం లేదు.

       ఇంకొక ఉదాహరణ. సూర్య ప్రకాశమువల్ల, సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై, మేఘమై, వర్షం పడుతోంది. సముద్రంలో ఉప్పునీరున్నా, ఉప్పునీటిలో కూడా మంచినీరే ఆవిరైనది. మురుగు గుంటలో నీరు కూడా ఎండ వేడికి ఆవిరైతే, మంచి నీరే లాక్కుంది. అది మేఘమై వర్షించింది. మంచి నీళ్ళు గాని, ఉప్పునీరు గాని, మురికి నీరు కాని, ఏ నీరైనా సరే, పేరుకు మలం ఉంది. మలము సూర్యప్రకాశముతో ఎండిపోయింది. ఆ మలంలో ఉన్నటువంటి ద్రవాన్ని కూడా ఆ సూర్యరశ్మి, ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి వేడి, పీల్చి, ఆ శుద్ధ జలాన్ని మేఘరూపంలో పెట్టి, మళ్ళీ వర్షించింది. కనుక సూర్యరశ్మి ఉప్పునీళ్ళ మీద పడ్డా, మలినమైన నీళ్ళమీద పడ్డా, మలంమీద పడ్డా దేనిమీద పడ్డా వాటియొక్క మాలిన్యం సూర్యరశ్మికి ఎలా అంటలేదో, సూర్యుని యొక్క ఉష్ణత్వం వలన అన్ని పనులు ఎట్లా అవుతున్నాయో, అట్లా ఆత్మ వీటన్నింటికీ అసంగము. ఆత్మకు వీటన్నింటితో అంటు కానీ, సంగత్వం కానీ లేదు.

       అందుకే సమీపం అనే పదం వాడారు. ఉప - అని వాడుతూ ఉంటాము వేదాంతంలో. ఉప వాసము. సమీపంలో వశిస్తున్నాము. ఆత్మకు సమీపంగా వశిస్తున్నాము. ఆత్మే అయ్యావు అనేది కరెక్టు కాదు. అయితే సమీపంగా వశిస్తున్నాము అనే మాట భ్రాంతిలోనే. ఆత్మ వేరు, నేను వేరు అన్నప్పుడే కదా ఉపవాసము. కాని  నీవే ఆత్మవి అయినప్పుడు  భ్రాంతి పోయినప్పుడు నీవు ఆత్మవి. నీవే ఆత్మవి అయినప్పుడు ఆత్మకు సమీపంగా ఉండేది ఏముంది? అంటే, భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞాన నివృత్తి చేసుకుంటూ, భ్రాంతి రహితం చేసుకుంటూ, భ్రాంతిలో చేసే ప్రయాణంలో సమీపానికి వెళ్తాం. భ్రాంతి రహితం అయిన తరువాత, ప్రయాణమే లేదు. ఒక్క ముసుగు తొలగింది అంతే! ఒక తెర చినిగింది అంతే!

       తెర ఉన్నంత వరకూ స్వప్రకాశము స్వానుభవానికి రాలేదు. స్వయం ప్రకాశము స్వానుభవానికి రాలేదు. అజ్ఞాన ఆవరణ అనే తెర తొలగేసరికి, స్వస్వరూపము ఉన్నది ఉన్నట్లుగానే సాక్షాత్కరించింది. ఎక్కడినుంచో వచ్చిందా? ఎక్కడి నుండి రాలేదు. అలాగే ప్రతిబింబ ప్రకాశము వల్ల, విషయాలు గ్రహించబడి, విషయ జ్ఞానంగా మారింది. ఈ ప్రతిబింబ ప్రకాశము, బుద్ధిమీద పడి ప్రతిఫలించిన ప్రకాశము. ఆ ప్రకాశంలో బుద్ధియొక్క దోషాలన్నీ ఉంటాయి.




No comments:

Post a Comment