Wednesday, 6 June 2018

kasireddy Nayana






అన్నదానం చేయడమే తప్ప అన్నం అమ్ముకునే సంస్కృతి మనది కాదు

అన్నము అంటే ఏమిటి ?
అన్నదానం అంటే ఏమిటి ?
అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?
అన్నదాన మహిమ చెప్పే కథ

అన్నదానం గురించి తెలుసుకోవడానికి ముందు అన్నము గురించి తెలుసుకుందాం ...

అన్నము అంటే ఏమిటి ?

అన్నం పరబ్రహ్మ స్వరూపం !
మనలో చాలా మందికి " అన్నము " అంటే తెలియదు . బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్ధాన్నే అన్నము అంటారని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ప్రతి మనిషికి పంచ కోశములు అని అయిదు కోశములు ఉంటాయి.
అవి అన్నమయ , ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ , ఆనందమయ కోశములు . అన్నమయ కోశము స్థూల శరీరానికి సంబందించినది. ఈ అన్నమయ కోశములో ప్రవేశించే అన్నము ప్రాణ శక్తిగా మారుతున్నది.కనుక అన్నమయ కోశాములోనికి వెళ్ళే ఆహారమే అన్నము అని అర్ధం .

అంతే కాదు తైత్తిరీయోపనిషత్తులో అన్నము వలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవి అని చెప్పబడి ఉంది . మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది కేవలం బియ్యం ఉడికించినది మాత్రమే కాదు అని అర్ధం చేసుకోవాలి .

అన్నదానం అంటే ఏమిటి ?

అన్నమే అన్నకోశములో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువలన అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడమే . అంతే కాదు ఒక ప్రాణం నిలవడానికి కావలసినవన్ని అన్నమే . కనుక అన్నదానం చేయడం శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి . ఏదైనా దానం చేసేప్పుడు విచక్షణ అవసరం కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు . ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే కనుక అది అత్యంత శ్రేష్టం అయినది .

అన్నము , ఆహార పదార్ధాలు అమ్మవచ్చా ?

అన్నము ఇతర ఆహార పదార్ధాలను విక్రయించడం మహా పాపం అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అందుకే అన్నము దానము మాత్రమే చేయాలి కానీ అమ్మకూడదు .

అన్నదాన మహిమ చెప్పే కథ

పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆరోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీచేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రుళ్లు బస చేస్తూ వెళ్లేవారు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటి పడే సమయానికి తాను వెళ్లవలసిన గ్రామానికి చేరుకోలేకపోయాడు. చీకటి పడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడిచేసి, చంపివేసి, దేహాన్ని తీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి, తన దారిన తాను వెళ్లాడు. కాశీ చేరాడు. దైవదర్శనం చేసుకున్నాడు.
ఈ బ్రాహ్మణునికి ఎప్పటినుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆరోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు, ఈ బ్రాహ్మణుణ్ణి చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా! నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాణ్ణి. శంబరుణ్ణి. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్లీ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.

                                            ఓం శ్రీ అన్నపూర్ణా దేవ్యే నమః




Saturday, 2 June 2018

om kasinayana




ఆత్మ ప్రకాశము వల్ల, బుద్ధి ప్రతిఫలించి, ప్రకాశించి బుద్ధి కర్మానుసారణి అనే పద్ధతిలో, బుద్ధి కర్మల విషయంలో చేయాల్సిన విధంలో కర్మ అనుభవం వచ్చిన తరువాత దానిని ప్రియంగానో, అప్రియంగానో ఎలా స్వీకరించాలనే విషయాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయం చేసే జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆత్మ ఆత్మప్రకాశం యొక్క ప్రతిబింబించిన ప్రకాశం. ఇక్కడ ప్రకాశము అంటే జ్ఞానము. అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము యొక్క ప్రతిబింబ జ్ఞానమే బుద్ధి జ్ఞానము. శుద్ధ బుద్ధి అయితే రెండూ ఒక్కటే. ఆత్మప్రకాశము, బుద్ధి ప్రకాశము, బింబ, ప్రతిబింబ ప్రకాశములలో ఏ భేదము ఉండదు. కాని, బుద్ధి విషయాలతో కూడినప్పుడు. బుద్ధి ప్రకాశము విషయానుభవాన్ని ఇస్తుంది కానీ, ప్రకాశ అనుభవాన్ని ఇవ్వడం లేదు. ఈ రెండూ సూర్యరశ్మి ప్రకాశ మాత్రమున జరుగుచున్నాయి కాని, సూర్యరశ్మికి ఏ మాలిన్యము అంటటడం లేదు.

       ఇంకొక ఉదాహరణ. సూర్య ప్రకాశమువల్ల, సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై, మేఘమై, వర్షం పడుతోంది. సముద్రంలో ఉప్పునీరున్నా, ఉప్పునీటిలో కూడా మంచినీరే ఆవిరైనది. మురుగు గుంటలో నీరు కూడా ఎండ వేడికి ఆవిరైతే, మంచి నీరే లాక్కుంది. అది మేఘమై వర్షించింది. మంచి నీళ్ళు గాని, ఉప్పునీరు గాని, మురికి నీరు కాని, ఏ నీరైనా సరే, పేరుకు మలం ఉంది. మలము సూర్యప్రకాశముతో ఎండిపోయింది. ఆ మలంలో ఉన్నటువంటి ద్రవాన్ని కూడా ఆ సూర్యరశ్మి, ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి వేడి, పీల్చి, ఆ శుద్ధ జలాన్ని మేఘరూపంలో పెట్టి, మళ్ళీ వర్షించింది. కనుక సూర్యరశ్మి ఉప్పునీళ్ళ మీద పడ్డా, మలినమైన నీళ్ళమీద పడ్డా, మలంమీద పడ్డా దేనిమీద పడ్డా వాటియొక్క మాలిన్యం సూర్యరశ్మికి ఎలా అంటలేదో, సూర్యుని యొక్క ఉష్ణత్వం వలన అన్ని పనులు ఎట్లా అవుతున్నాయో, అట్లా ఆత్మ వీటన్నింటికీ అసంగము. ఆత్మకు వీటన్నింటితో అంటు కానీ, సంగత్వం కానీ లేదు.

       అందుకే సమీపం అనే పదం వాడారు. ఉప - అని వాడుతూ ఉంటాము వేదాంతంలో. ఉప వాసము. సమీపంలో వశిస్తున్నాము. ఆత్మకు సమీపంగా వశిస్తున్నాము. ఆత్మే అయ్యావు అనేది కరెక్టు కాదు. అయితే సమీపంగా వశిస్తున్నాము అనే మాట భ్రాంతిలోనే. ఆత్మ వేరు, నేను వేరు అన్నప్పుడే కదా ఉపవాసము. కాని  నీవే ఆత్మవి అయినప్పుడు  భ్రాంతి పోయినప్పుడు నీవు ఆత్మవి. నీవే ఆత్మవి అయినప్పుడు ఆత్మకు సమీపంగా ఉండేది ఏముంది? అంటే, భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞాన నివృత్తి చేసుకుంటూ, భ్రాంతి రహితం చేసుకుంటూ, భ్రాంతిలో చేసే ప్రయాణంలో సమీపానికి వెళ్తాం. భ్రాంతి రహితం అయిన తరువాత, ప్రయాణమే లేదు. ఒక్క ముసుగు తొలగింది అంతే! ఒక తెర చినిగింది అంతే!

       తెర ఉన్నంత వరకూ స్వప్రకాశము స్వానుభవానికి రాలేదు. స్వయం ప్రకాశము స్వానుభవానికి రాలేదు. అజ్ఞాన ఆవరణ అనే తెర తొలగేసరికి, స్వస్వరూపము ఉన్నది ఉన్నట్లుగానే సాక్షాత్కరించింది. ఎక్కడినుంచో వచ్చిందా? ఎక్కడి నుండి రాలేదు. అలాగే ప్రతిబింబ ప్రకాశము వల్ల, విషయాలు గ్రహించబడి, విషయ జ్ఞానంగా మారింది. ఈ ప్రతిబింబ ప్రకాశము, బుద్ధిమీద పడి ప్రతిఫలించిన ప్రకాశము. ఆ ప్రకాశంలో బుద్ధియొక్క దోషాలన్నీ ఉంటాయి.




Friday, 1 June 2018








" మనం పుడితే తల్లి సంతోషించాలి 
          పెరిగితే తండ్రి ఆనందపడాలి 
       బ్రతికితే సమాజం సంబరపడాలి 
    చస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి 
                   అదే  జీవితం అంటే  "