#రాయలసీమ..
#నిత్యాన్నధాన నిలయం కాశిరెడ్డి నాయన '#ఓంకారం'
కర్నూలుజిల్లాలో ఎన్నో చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. కానీ వాటిలో ఎక్కడాలేని ప్రత్యేకత ఒకచోట ఉంది. అదే కాశిరెడ్డి నాయన నిత్యాన్నధాన నిలయం 'ఓంకారం'. కర్నూలుజిల్లా నంద్యాలకు సమీపంలోని ఆత్మకూరు మండలం ఈర్నపాడు నుంచి 8కిలోమీటర్ల దూరంలోని అడవీప్రాంతంలో ఈ ఓంకారేశ్వరస్వామి కోలువై ఉన్నాడు. ఇది కేవలం దైవం కోసం వెలసినది మాత్రమే కాదు. కొన్నివేల మందికి అనునిత్యం మూడుపూటలా భోజనం పెడుతున్న నిలయం. దేవుడు కొలువై ఉన్న చాలాచోట్ల అన్నధానాలు నిర్వహించడం చూస్తుంటాం... వాటన్నింటికి భిన్నమైన భోజనం ఇక్కడ పెడతారు. ప్రతిరోజు ఒక్కో రకమైన వంటకాలతో నిత్యం వేలమందికి ఇక్కడ భోజనం పెడతారు.
ఉదయం రకరకాల టిఫిన్ కూడా పెడతారు. వాటిలో దోశే, ఇడ్లీ, పొంగళి, సాంబారు అన్నం, పులిహోర, పులగం, చట్నీ, ఉగ్గాని(బోరుగులు లేదా మర్మరాలు), బజ్జీలు, ఉప్మా పెడతారు. మద్యాహ్నం రోజుకోక రకం ప్రసాదాలు, తీపి పదార్థాలు(స్వీట్)లు పెడతారు. వాటిలో ప్రధానమైనవి సేమీయా, సెనిగబేడలు కలిపి చేసే పరమాన్నం(పాయస్యం), మన ఇంట్లో కూడా కేవలం పండగ పబ్బాలకు కూడా అంతబాగా చేయలేరు. కానీ అక్కడ చేసే పాయస్యంలో బాదం, గోడంబీ, ఎండు ద్రాక్ష, కర్బూజ విత్తనాలు, యేలకలు, నెయ్యి దట్టంగా వేస్తారు. అంతేనా ప్రతి ఒక్కరికి నెయ్యిని విడిగా వడ్డిస్తారు. వీటికోసం అక్కడ దాదాపు 400 వందల ఆవులు మేపుతున్నారు. అవన్నీ కూడా భక్తులు,దాతలు సమర్పించినవే. బచ్చాలు(బొబ్బట్లు), పూర్ణం కర్జికాయలు, బియ్యంపాయస్యం(అన్నంలోకి బెల్లం వేసి చేసేది), చెక్కర పొంగళి, వీటన్నికి తోడుగా మరోక స్వీట్ లడ్డూ, జిలేబి, కొవా కర్జికాయ, బాదుసా, పాలకోవ, కేసరి లాంటి ఏదో ఒకదానిని విదిగా పెడతారు.
ఇక అన్నం విషయానికి వస్తే పులిహోర, లేదా చిత్రాన్నం, అన్నం, పప్పూ, రసం, సాంబారు లేదా పచ్చి పులుసు, చట్నీ, ఊరగాయ, పెరుగన్నం, అప్పడం లేదా బొంగులు(గొట్టాలు), ఎంతకావాలంటే అంత పెడతారు. కొన్ని వందల ప్లేట్లు భక్లులు సమర్పించినవి అక్కడ ఒక పెద్ద డబ్బాలో పెట్టి ఉంటారు. ఎవరికి కావలసిన వారు వెళ్లి వాటిని తీసుకుని కడుపునిండా భోజనం చేయవచ్చు. ఎప్పుడు వినడమే కానీ పోయి చూసింది లేదు.ఓ వివాహానికి ఈర్నపాడుకు వెళ్లినప్పుడు పక్కనే ఉంది వెలదామని బలవంతపెడితే వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత ఈ కలికాలంలో ఇంత బాగా కాశిరెడ్డి నాయన అశ్రమాన్ని నిర్వహిస్తున్న వారు ఉన్నారా..? అనిపించింది.
నిజానికి చాలా ట్రస్టులు, దేవాలయాల దగ్గర ఇలా నిత్యాన్నధానాలు నిర్వహిస్తున్నారు కానీ ఈ తరహా చేస్తున్న వారిని నాకు తెలిసి ఇక్కడ మాత్రమే చూశాను. అలాగే అక్కడే కొండ పైకి 4 కిలోమీటర్లు కాలినడకన వెళితే కాలజ్ఞాని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా నిర్మించిన కొలను, కొలను భారతీ అమ్మవారితో పాటు ఒకే శిలపై ఇటు వెంకటేశ్వర స్వామి, వెనుక పద్మావతి అమ్మవారు కొలువై ఉన్నారు. వీటిని చూడటానికి కొండపైకి రాళ్ల బాటలో నడిచి వెళ్లాలి. అక్కడ కూడా నిత్యాన్నధానం భోజనం పెడుతున్నారు. పైన కూడా ప్రసాదంగా పులిహోర, అవు పెరుగుతో చేసిన కమ్మని పెరుగన్నం, లడ్డూ పెడతారు. అవి ఎంత కమ్మగా ఉన్నాయో చెప్పడానికి లేదు. నేను రెండుసార్లు పెట్టించుకుని తిన్నాను. మాకు ఒకసారి కొండపైకి ఎక్కడానికే కష్టం అనిపించింది.. కానీ వారు కింది నుంచి అన్నిటిని మోసుకుని వెళ్లి పెడతారు. అంతేకాదు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కాఫీ కూడా పోస్తారు. అక్కడ సాధువులు, పిల్లలు వదిలించుకున్న, వాళ్ల మీద విరక్తి చెంది వచ్చిన తల్లిదండ్రులు, అనాధలు ఎంతోమంది ఉన్నారు.
అక్కడ జరుగుతున్న కార్యక్రమాలలో వారు కూడా చేదోడువాదోడుగా ఉంటూ శక్తి ఉన్నంతమేరకు సహాయ సహాకారాలు అందిస్తూ శేషజీవితాన్ని గడిపేస్తున్నారు. అక్కడ ఉన్న ఒక వృద్ధ దంపతులను పలకరించగా కన్నపిల్లల చేత ఈసడించుకోవడం కంటే ఇదే ఉత్తమం కదా నాయనా... దైవ సన్నిధిలో ఎందరికో భోజనం వడ్డిస్తూ... వారి ఆశీర్వచనాలతో పోవడం కంటే స్వర్గప్రాప్తి ఉంటుందా అన్నారు. ఒక్కసారిగా నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలా అక్కడ ఉన్న చాలామంది వృద్ధులకు ఒక్కోక్కరికి ఒక్కో ధీనగాధ ఉంది. మరి ఇంతమందికి ఇంత రుచికరమైన భోజనం ప్రతిరోజు ఎలా పెడుతున్నారని ఆరాతీయగా చుట్టూపక్కల వందల గ్రామాల ప్రజలు తమకు పండిన వరి పంటలో 1నుంచి 2శాతం కాశిరెడ్డి నాయన ఆశ్రమానికి తెచ్చి ఇస్తారట. అంతేకాకుండా ఎవరికి తోచిన సహాయ సహకారాలు అందిస్తారట. దేశ విదేశాల్లో ఉన్న భక్తులు, దయాగుణం కలిగిన దాతలు సహాయం చేస్తారట. కాశిరెడ్డి నాయన జీవించి ఉన్నప్పుడే ఇక్కడే కాకుండా మరో 18చోట్ల ఇలానే నిత్యాన్నధానాన్ని నిర్వహిస్తున్నారని అక్కడి పూజారి చెప్పుకొచ్చారు. నిజంగా వారికి చేతులేత్తి నమష్కరిస్తున్నాను వేలమంది ఆకలి తీర్చుతున్నందుకు...!