Thursday, 27 November 2025

మృష్టాన్న భోజనం" అంటే

      

మృష్టాన్న భోజనం" అంటే అంటే అన్నం ప్రధానంగా ఉండే, రుచికరమైన మరియు సంపూర్ణమైన భోజనం అని అర్థం. ఇది విటమిన్లు, కేలరీలు, ప్రోటీన్లు వంటి శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన ఆహారం, దీనిని "పూర్తి భోజనం" అని కూడా చెప్పవచ్చు. 

రుచి మరియు పోషకాహారం: మృష్టాన్న భోజనం కేవలం కడుపు నింపడమే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

సమగ్ర ఆహారం: అన్నంతో పాటు కూరలు, పప్పు, పెరుగు వంటి అనేక రకాల వంటకాలతో కూడిన సంపూర్ణ ఆహారాన్ని ఇది సూచిస్తుంది.

పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలు: పండుగలు, వేడుకలు, లేదా ముఖ్యమైన సందర్భాలలో ప్రత్యేకంగా వండి వడ్డించే భోజనంగా దీన్ని పరిగణిస్తారు. ఉదాహరణకు, తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులకు ఉచితంగా అందించే ప్రసాదాన్ని కూడా మృష్టాన్న భోజనంగా పిలుస్తారు.

Thursday, 30 October 2025

కరపత్ర స్వామీజీ

 ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్లి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటి వద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు.

ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించ లేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్లీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి అని అన్నాడు. పండితుడికి కోపం వచ్చింది నేనిక్కడి ఉంటుండగా నాతో మాట్లాడకుండా నాకు చెప్పకుండా ఇంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చం అడుగుతాడా. వీటికి తగిన శాస్తి చేస్తాను అని అనుకుని వెంటనే ఏమేవ్ మూడు_జన్మల_ముష్టివాడు వచ్చాడు బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపం వచ్చిందని గ్రహించి వెంట వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలకు వెళ్లిపోయింది. కానీ బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్న మాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిపుడు ఏంచేస్తాడు తిడతాడా లేదా ఇంకా ఏం చేస్తాడా అని లోలోపల బాధ పడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏమండీ అని పిల్చాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు మీరు నన్ను మూడు జన్మలు ముష్టి వాడన్నారు అది ఎలాగా అన్నాడు అదా దానికే ఉంది. తెలుసుకోవాలనుకుంటున్నావా అయితే ఇలా కూచో అన్నాడు. ఫరవాలేదు చెప్పండి నిలబడతాను అన్నాడు.

శ్లోకం :

అదత్త దానాచ్చ భవేత్ దరిద్రః

దరిద్ర దానాచ్చ కరోతి పాపం।

పాప ప్రభావాత్ పునర్దరిద్రః

పునర్దరిద్రః పునరేవ పాపీ॥


అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు అయ్యా మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలియదు. నాకు అర్ధమయ్యేటట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవరికీ ఏమీ ఇవ్వలేదు. అంటే రెండు కారణాలు. నీకు లేకపోయి వుండొచ్చు. ఉండి కూడా దానం చేయక పోయుండచ్చు. లేకపోతే గతజన్మలో నువ్వు ముష్టి వాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టి వాడుగా అయిపోయావు. అంటే రెండు జన్మలు ముష్టివాడివి. అర్థమైంది మరి చెప్పొద్దన్నాడు బిచ్చగాడు. ఎందుకు ?

ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నాదగ్గర ఏమీ లేదు కాబట్టి వచ్చే జన్మ కూడా. అని గొణుక్కుంటూ వెళ్లిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి ఇందులోంచి బయటపడే మార్గం ఏమీ లేదా. నేనిలాగే జన్మజన్మలకు బిచ్చగాడి గానే ఉండిపోవాలా? అని అడిగాడు.

జ్ఞానం సమయం వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూచో అన్నాడు. పెద్దవారి మీదగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు కూచో జిజ్ఞాసా పరులకు శాస్త్రం చెప్పొచ్చు చెప్పాలి కూడా అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పుటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు పండితుడు, నేను దానం ఎలా చేస్తాను నాదగ్గర ఏముంది గనుక అన్నాడు యాచకుడు.


అన్నీ ఉన్నాయి లేకపోవడమనేది లేదు. నీలో దాన గుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్. ఈరోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంత మాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు. తనకు అవసరమున్నాసరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమేదానం తాలూకు ముఖ్యోద్దేశ్యం. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు అన్నాడు బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆరోజు నుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చేయాలి. ఇది ఎలా తెలుస్తుంది దాని కోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇంటింటికి తిరిగే కాలం కూడా తగ్గిపోయింది. అతనికి ఒక గుర్తింపు లాంటిది వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవరి దగ్గర పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు ఇతను మన ఇంటికొస్తే ఈ రోజు బాగుణ్ణు. అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు మొన్న వాళ్ళింటి కెళ్ళాడు. నిన్న వీళ్ళింటికి ఒచ్చాడు. ఇవ్వాళ మనింటికి తప్పకుండా వస్తాడని వాళ్లు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు. అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది. సాత్వికంగా ఉండేది. మంచి ఆహారం లభించేది. పుచ్చకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి పది మంది బిచ్చగాళ్లు చుట్టూ చేరి నువ్వే మా గురువన్నారు. ఇతడికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళిపో కూడదు అని అనిపించింది. బయలుదేరాడు వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం అందులోనున్న సగం దానం చేయడం. మిగిలినదే తినడం అంటే అర్థాకలి తన ఆకలి కడుపుని భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తం మీద కాశీ పట్టణాన్ని చేరాడు. అతను ఇదేనియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టుకింది ఎక్కువసేపు కూచునేవాడు. ఆతడు అందరిలాగా ఒక అరగంట కూర్చుని ఏదో వస్తే తీసుకుని వెళ్లిపోవడమనే ప్రసక్తి లేదు. లేదా సాయం చేయాలని, ధర్మం చేయండి అనో మిగతా యాచకులు చెప్పెటటువంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతిని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా ఆతను వెళ్లాక ఎవరో తీసుకునే వాళ్లే తప్ప అతడు ఏనాడు అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతని మీద పదిమంది దృష్టి పడింది. అతనొక సాధకుడని కారణ జన్ముడనీ అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేద పాఠశాల ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరును కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆ పేరు పెట్టారు . కరమే పాత్రగా కలిగినటువంటి వాడు అని ఆ పేరుపెట్టారు.


ఇలాగ అతని పేరుతో వేద విదులు వేదాభ్యాసం చేస్తున్నారు, పిల్లలకు వేదం శాస్త్రం పురాణం ఇతిహాసాలు చెప్తున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు వచ్చే పోయే వాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కానీ ఇతనికీ విషయాలు ఏవీ తెలియవు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానంచేసి ధ్యానం చేయడం మధ్యహ్నం బిచ్చమెత్తుకోవడం తనకు వచ్చినదాంట్లో సగం దానం చేస్తుండడం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయింతర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునే వాళ్లు నిలబడే వాళ్ళు చూసేవాళ్ళు దండంపెట్టుకునే వాళ్లు పెరిగారు. వారి కోసం అన్నట్టుగా అక్కడ నీడని కల్పించడం పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థ యాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లయినాక ఓ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలని అనిపించి ఆ సభ బాధ్యత అంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీ ని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకు ఈయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తరువాత నాలో చాలా మార్పు అంతేకాదు కొన్ని కుటుంబాలు వాళ్లయితే మేమీయనకి దండం పెట్టిన తర్వాత మొక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్లయిందన్నవారు, మాకుఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవాళ్లు మాకు ఏ ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి పరమేశ్వరుని దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగిందని ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కానీ ఒకటి మాత్రం అందరూ చెప్తున్నది ఈయనే గురువు నాకు. మా గురువు గారు కాశీ వెళ్లమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేక మంది అనేక విషయాలు చెప్తున్నారు. తన పేరే కరపాత్ర స్వామి అని పెట్టారన్న విషయం తెలియని స్వామీజీ

ఇంతకీ 1) కరపాత్ర స్వామిజీ ఎవరు. ఇన్నాళ్లు కాశీలో వుండి వారిని దర్శించుకోలేక పోయాను ఎంత దౌర్భాగ్యుణ్ణి. అంటూ మధనపడుతున్నాడు

2) నాకు గురువు ఎవరు ఈ రెండు ప్రశ్నలు ఆయనను బాధిస్తున్నాయి అక్కడికొచ్చే వారికి ఏమిచెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షా సమయమయింది నేను వెళ్లాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష ఐన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరు ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువు అని నిర్ణయించుకున్నాడు.

అంతే వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట బిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయలుదేరాడు. దారిలో ఇతన్ని గుర్తించిన వాళ్లు కలసి చూసి వచ్చిన వాళ్లు అక్కడ వేదం చదువుకున్న వాళ్లే కాదు ఆ సత్రంలో భోంచేసిన వాళ్లు అందరూ ప్రతి గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం అయనకేదో ఇవ్వడం అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్ట మని చెప్పి పెద్దలకు ఇచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం ఈయన ఖ్యాతి ఆనోట ఆనోట ప్రతి గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు ఆ గ్రామంలో వాళ్ళు కూడా చాలా ఆనందంతో కరపాత్ర స్వామిజీ వారు వచ్చేరు అని చెప్పి ఆయనకి ఆగ్రామంలో ఉంటున్న పండితుడిని పిలిచారు. ఆయనకూడా వెంటనే అంగీకరించాడు. పండితుడువెళుతూనే కరపాత్ర స్వామివారికి పాద నమస్కారం చేసాడు ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూచోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను నేనక్కడ సత్రంలో పనిచేశాను అక్కడ వేదపండితులు శాస్త్ర పండితులు శాస్త్రములు అని నేర్చుకుంటారు నేనక్కడున్నాను వీరిని మళ్లీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది. ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడటం ఐపోయిన తరువాత నాకు భిక్షా సమయం అయింది నేను వెళ్లిపోతానని చెప్పాడు. పండితుల వారు స్వామీ జీ గారిని మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరు లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన ఆతల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది.ఆవిడ ఆభిక్ష పెడుతున్నప్పుడు ఆమెకుఏదో మాతృత్వభావన తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకు ఎందుకో అనుమానం వచ్చింది, చూస్తున్నప్పుడే కొంత అనుమానము ఇలా అడిగే సరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగ పరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది.

అమ్మా నేను ఇది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామిజీ. అయ్యో అదెంత మాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు స్వామీజీ ఆభాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు. స్వామిజీ ఇచ్చేశాడు.

ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహ యజమాని ఐన పండితుడు అతిథి ఐన స్వామీజీ ఇద్దరు కూడ భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామిజీ అ అడిగాడు. పండితుల వారు నన్ను గుర్తు పట్టారా అని. అబ్బే నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండీ నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు.

సరే నేనెవరో చెప్తా వినండి అన్నాడు స్వామీజీ. వద్దండీ శాస్త్ర ప్రకారమూ ఏరుల(నదుల), శూరుల, మహనీయుల మహాత్ముల జన్మ రహస్యం అడగ కూడదు,అన్నాడు

దానికి స్వామీజీ చిరునవ్వుతో, సరే మీరు అడగలేదు నేనే చెప్తున్నాను వినండి. నాగురుదేవులు మీరే. అన్నాడు . అబ్బే నేను పండితుడను. అంత వరకే అన్నాడు.

అయ్యా ముందు వినండి. నేను ఎవరో కాదు మీరు చెప్పిన మూడు జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతి భిక్ష పెట్టమని ప్రార్థించింది, అంత మాటలొద్దు అమ్మా. ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. ఆనాటికే కాదు ఈనాటికీ నేను సామాన్యుడినే. కానీ ఆ రోజు పండితుల వారు అంత తీవ్రంగా అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు. నేను ఈనాడు ఈస్థితికి వచ్చే వాణ్ణి కాదు. అంచేత మీరే నాగురువు అంటూ నమస్కరించారు స్వామీజీ, లేదు లేదు మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను మహా అహంకారిని పండితుడనని చాలా గర్వం ఉండేది నాకు, నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయాయి గనక

ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు.


బెనారస్ యూనివర్శిటీ (కాశీ విశ్వ విద్యాలయం) లోఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డ్ ఇస్తున్నారు.👍👍👍👍👍👍👍👌👌👌👏👏👏👏👏

Monday, 24 March 2025

అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.*

 *ఒకసారి ఒక కాపలాదారుడు ఏదో పనిమీద పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది, అందుచేత రాజువద్దకెళ్ళి, “ప్రభూ! నేను అత్యవసరంగా పొరుగూరికి వెళ్ళవలసి వచ్చింది. ఈ రాత్రికి నా కుమారుడు మూగవాడైనప్పటికీ ఊరి కాపలా కాస్తాడు, ఇందుకు అనుమతించండి” అని వేడుకొన్నాడు, రాజు అందుకు సమ్మతించాడు.*


*ఈ మూగవాడు ఎలా కాపలా కాస్తాడో చూడాలనే ఆశతో రాజు మారువేషంలో గమనించాలనుకొన్నాడు. ఆ కాలంలో రాజులు మారు వేషంలో రాత్రిళ్ళు సంచారం చేసి ప్రజల బాగోగులు స్వయంగా పరిశీలించడం రివాజుగా ఉండేది!... రాత్రి అయింది. అది మొదటి యామం, తప్పెట చేతపుచ్చుకొని ఆ బాలుడు వీథి కాపలా కాయసాగాడు, రాజు అతణ్ణి వెంబడించసాగాడు, హెచ్చరిక చేసే సమయం వచ్చింది. అప్పుడు మూగవాడు ఆ  బాలుడు తప్పెట కొడుతూ ఇలా చెప్పాడు:*


*“కామం క్రోధంచ - లోభంచ - దేహేతిష్ఠంతి తస్కరాః*

*జ్ఞానరత్నాపహారాయ - తస్మాత్ జాగృతః జాగృతః."*


*మన దేహంలో కామ క్రోధ లోభాలనే తస్కరులు కూర్చుని జ్ఞానమనే రత్నాన్ని అపహరించ పొంచి ఉన్నారు... కాబట్టి జాగ్రత్త! - ఈ మాటలు విన్న రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు; నిశ్చేష్టుడయ్యాడు. 'ఇతడు నిజానికి మూగవాడు కాడు, ముందుగానే జ్ఞాని అయిన జీవన్ముక్తుడు, ముముక్షువు. ఒక మంచి ఆత్మ ఇతడి శరీరంలో ఉన్నది, కనుక ఇతణ్ణి వెంబడించి, గమనిస్తూ ఉంటాను' అని రాజు భావించాడు.*


*మళ్ళా రెండవ ఝాము వచ్చింది, అప్పుడు ఆ జ్ఞాని ఇలా చాటాడు:*


*“జన్మదుఃఖం జరాదుఃఖం -*

*జాయాదుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం - తస్మాత్ జాగృతః జాగృతః.”*


*పుట్టడం దుఃఖం, చావడం దుఃఖం, జరాభయం దుఃఖం, సంసార సాగరం దుఃఖం, మళ్ళా మళ్ళా వచ్చేవి కాబట్టి జాగ్రత్త - అని హెచ్చరిక.*


*ఈ శ్లోకాన్ని విని రాజు పరవశుడైనాడు, తృతీయ యామం వచ్చింది:*


*“మాతానాస్తి - పితానాస్తి - నాస్తి బంధు సహోదరః*

*అర్థంనాస్తి - గృహంనాస్తి - తస్మాత్ జాగృతః జాగృతః”*


*తల్లి లేదు, తండ్రి లేడు, బంధువులు లేరు, సహోదరులు లేరు, ధనంలేదు, గృహం లేదు (ఇదంతా మిథ్య అని అర్థం) జాగ్రత్త! జాగ్రత్త! - అని చాటాడు. ఇది విన్న రాజు అచేతనుడయ్యాడు, అయినా వెంబడిస్తూనే ఉన్నాడు... ఇంతలో నాలుగవ యామం వచ్చింది, అప్పుడు ఆ బాలుడు...*

 

*“ఆశయా బధ్యతే లోకే - కర్మణా బహుచింతయా*

*ఆయుఃక్షీణం - నజానాతి - తస్మాత్ జాగృతః జాగృతః.”*


*అని చాటింపు వేశాడు.*


*ఆశాపాశంచేత కట్టువడి తిరుగుతూ లోక కర్మల చేత బహుచింతలకు లోనై ఆయువు క్షీణించడం ఎరుగలేరే! కాబట్టి జాగ్రత్త జాగ్రత్త - అని చాటాడు...*


*ఈ చివరి శ్లోకాన్ని విన్న రాజు మనస్సు పులకించిపోయింది, అతడు సాధారణ ఊరి కాపరి కాడు. పవిత్రమైన ఆత్మగల్గిన జీవన్ముక్తుడు, అజ్ఞానమనే చీకట్లు ఆవరించినవారికి దారి చూపించే మహానుభావుడు. కాబట్టి ఈతణ్ణి తన రాజప్రాసాదానికి రావించి అతడికి ఇష్టమైన ఉద్యోగం ఇప్పించాలి అని నిర్ణయించుకొని రాజు తన నగరికిపోయాడు.*


*మర్నాడు ఆ బాలుని తండ్రి రాజును చూడవచ్చాడు... అతడితో రాజు ఇలా అన్నాడు: “ఇంతదాకా మూగగా ఉన్న నీ కుమారుడు నిజానికి మూగ కాడు. అతడు పూర్వజన్మజ్ఞానం ఉన్న మహనీయుడు, పుణ్యాత్ముడు, అతడికి నా రాజ్యంలో తనకు ఇష్టమైన ఉద్యోగం ఇవ్వాలని ఆశిస్తున్నాను, నా కోరిక తీర్చమని అతడిని అడుగు.” తండ్రి తన కుమారుడికి రాజుగారి కోరిక తెలుపగా, ఆ కుమారుడు అందుకు సమ్మతించి రాజు వద్దకు వచ్చాడు. అప్పుడు రాజు, “స్వామీ! మీరు ఏ పని చేయడానికి ఇష్టపడుతారో దాన్ని చేయమని వేడుకొంటున్నాను” అని అడిగాడు.*


*తన పుత్రుడు అప్రయోజకుడని ఇంతవరకు ఎంచిన తండ్రి కూడా జరుగుతూన్నది అర్థం కాక ఆశ్చర్యపోతున్నాడు. అప్పుడు ఆ జీవన్ముక్తుడు, “రాజా! మీ రాజ్యంలో ఘోరపాపం, హత్యలు చేసినవారికి ఏం శిక్ష విధిస్తారు?” అని అడిగాడు. అందుకు రాజు “మరణ శిక్ష” అని బదులిచ్చాడు. "అయితే ఆ మరణదండన నెరవేర్చే ఉద్యోగం నాకు ఇప్పించండి. నా చేతులమీద, నా కత్తితో వారి తల తీస్తాను అంటూ తన కోరికను తెల్పాడు ఆ పసివాడు. రాజు అమితాశ్చర్యపోయాడు, అతడి కోరిక మేరకు అందుకు సమ్మతించాడు. ఊరికి వెలుపల మరణశిక్ష నెరవేర్చే స్థలంలో ఒక కుటీరం వేసుకొని ఆ బాలుడు తన కర్తవ్యాన్ని నిర్వహించసాగాడు, ఇలా కొంతకాలం గడిచింది.*


*దేవలోకంలో యమధర్మరాజు ఒకరోజు చింతాక్రాంతుడై బ్రహ్మ దేవుణ్ణి దర్శించబోయాడు. “ఎందుకు విచారిస్తున్నావు? నీ ధర్మం సక్రమంగా నెరవేరుతూన్నది కదా?” అని యముణ్ణి, బ్రహ్మ అడిగాడు. అందుకు యమధర్మరాజు దీర్ఘంగా నిట్టూర్చి ఇలా అన్నాడు: “ఓ బ్రహ్మదేవా! ఏం చెప్పమంటావు? పాపాత్ములు నా లోకం చేరగానే వారి యాతనా శరీరాన్ని వారివారి కర్మానుసారంగా శిక్షిస్తాను కదా! కాని ఇప్పుడు ఎందుచేతనో చాలకాలంగా పాపాత్ములు కర్మను అనుభవించడానికి రావడం లేదు. నా ధర్మ నిర్వహణ జరగడం లేదు, మరి భూలోకంలో పాపాత్ములే లేరా!లేకుంటే పాపాత్ములు మరెక్కడికైనా పోతున్నారా?నాకు అవగతం కాకున్నది, ఇదే నా విచారానికి కారణం.” బ్రహ్మకి ఇది విచిత్రంగా తోచింది. దీన్ని పరిశోధించే నిమిత్తం భూలోకానికి వచ్చాడు. అక్కడ రాజు నేరస్తులకు మరణదండన విధిస్తూ ఉన్నాడు. వారు మన జీవన్ముక్తుడి వద్దకు మరణశిక్ష అమలుపరచడానికై కొనిరాబడుతూన్నారు. ఈ తతంగం చూసి బ్రహ్మ వారిని వెంబడించి మన జ్ఞాని నివసిస్తూ ఉన్న చోటుకు వచ్చాడు. అప్పుడు అక్కడ జరుగుతూన్నది చూడగా బ్రహ్మదేవుడికే ఆశ్చర్యం వేసింది...*


*అదేమంటే:..*

*మరణశిక్ష అమలు జరిగే ఆ వేదికకు ఎదురుగా శివుడు, విష్ణువుల దివ్యమంగళమూర్తుల పటాలు అమర్చి ఉన్నవి. అందంగా పుష్పాలంకారం చేసి అంతటా సుగంధం నిండగా ధూపదీపాలు పెట్టబడినవి, చూసేవారి మనస్సు భక్తిపరిపూరితమై చేయెత్తి నమస్కరించాలనే రీతిలో నేత్రానందకరంగా ఉంది... అంతేకాక ఆ పటములకు ముందు పురాణాలు, కావ్యాలు, రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాలు అమర్చబడి ఉన్నాయి. ఆ చోటు దేవాలయమేగాని మరణాలయంగా కానరాకున్నది...*


*మరణశిక్ష విధింపబడి కొనిరాబడినవారికి ఆ జ్ఞాని తాను తల తీయడానికి ముందు ఆ పటముల ఎదురుగా వారిని నిలబెట్టి నమస్కరింపచేసి, వారి మనస్సు అర్థమయ్యే రీతిలో నీతులు, భగవంతుడి నామమహిమ, సంకీర్తనం మధురంగా చెబుతున్నాడు... అతడి మాటలు ఆలకిస్తూ వారు సర్వమూ మరచి, తనువు తన్మయమవుతూ ఉన్న తరుణం చూసి వారికే తెలియకుండా వెనుక ప్రక్కనుంచి వారి తల ఖండించేవాడు. అయితే ఆ తల తెగుతున్నప్పుడు వారు మైకంలో ఉన్నట్లుగా గుర్తించలేకపోయేవారు... దైవనామ సంకీర్తనం చెవుల్లో పడేటప్పుడు వారి జీవం పోవడంతో వారి మనస్సు ప్రక్షాళితమై, ముక్తి పొందేవారు.*


*ఈ తతంగం అంతా చూసిన బ్రహ్మదేవుడు ముగ్ధుడై మన జ్ఞాని ముందు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూడగానే జ్ఞాని సంతోషంతో నమస్కరించాడు.*


*"వత్సా!! ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో మరణ దండన ఇలా నెరవేర్చడంలో అంతరార్థం ఏమిటి?ఎందువల్ల ఇలా చేస్తున్నావు, అని బ్రహ్మ, జ్ఞానిని అడిగాడు. అందుకు అతడు వినమ్రంగా బ్రహ్మతో ఇలా పలికాడు: ... ఓ బ్రహ్మదేవా! మీకు తెలియనిదంటూ ఏదన్నా ఉంటుందా? నా గత జన్మలోమరణ సమయంలో దైవనామ స్మరణకు బదులు కలిగిన తలంపుల వలన నాకిలా జన్మించాల్సి వచ్చింది. భగవానుడు గీతలో 'ఎంతటి క్రూరకర్ముడైనా ఎవడు మరణ సమయంలో నా నామస్మరణ చేస్తాడో వాడు నా సాన్నిధ్యం పొందుతాడు' అని సెలవిచ్చాడు !!!... కాబట్టి సులభోపాయంలో వీరినందరినీ దైవనామ స్మరణతో ముక్తులను చేయదలచాను, నా అనుభవం ఒక పాఠమైనది.”*


*అంతా విన్న బ్రహ్మదేవుడు పరిపూర్ణ సంతృప్తి, ఆనందాలతో అతణ్ణి ఆశీర్వదించి సత్యలోకం చేరుకొన్నాడు. మరణకాలంలో సత్ చింతనతో ఉంటే అలాంటి పుట్టుకే లభిస్తుంది, లేక ముక్తి లభిస్తుంది. సత్ చింతన కాక వేరే ఏ చింతన అయినా ఉంటే అందుకు సంబంధించిన పునర్జన్మ కలుగుతుంది. కాబట్టి అంత్యకాలంలో భగవన్నామమే పరమ ఔషధంగా పనిచేస్తూన్నది...*


*నామస్మరణే సులభోపాయం, ఆ నామస్మరణే ధన్యోపాయంగా చేసుకొని కడతేరే మార్గం చూసుకొందాం గాక! కావున మరణ సమయము ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కావున భగవన్నామ స్మరణ నిత్యము అన్ని వేళలలో ఏ పని చేస్తున్నా మానసికముగా చేస్తూ ఎదుటి మనిషిలో ఉన్న భగవంతుని  గౌరవిస్తూ ప్రవర్తిస్తే‌‌ తప్పకుండా అంత్యకాల నామ స్మరణ తప్పక లభిస్తుంది...*


*భగవద్గీత లో చెప్పినటుల‌ "అద్వేష్టా సర్వ భూతానాం" ఆచరించుతూ ఉంటేనే ఇది సాధ్యము. ఏ ఒక్కరి మీద ద్వేషము లేని వారికే ఇది సుసాధ్యము... ఎందుకనగా తను వేరొకరిని ద్వేషించే సమయములో ఒకవేళ  మరణము సంభవస్తే అదే ద్వేషముతో పాము-కప్ప జన్మలను, మరియు గజ-కచ్చప (ఏనుగు-తాబేలు) జన్మలను పొంది అనేక యుగములు తగవులాడుకొనే అవకాసము ఉన్నదని పురాణములు చెప్పుచున్నవి. కావున మొట్టమొదలు మనము శత్రువులు అనుకునే వారిమీద మన అభిప్రాయములను సరిదిద్దుకుని "అద్వేష్టా సర్వభూతానాం" గా తయారు అవడము అత్యంతావశ్యకము.*


*నిత్యము రామనామ స్మరణ చేసిన వాల్మీకి మహర్షి అంత్య సమయములో కూడా రామ నామ స్మరణ చేయడము వలన తులసీదాసు గా జన్మించగనే (1498-1623) అందరు పిల్లలవలె ఏడవకుండా "రామ్ రామ్" అని పలకడము అందుకని మొదలు ఆయన పేరు "రాంబోలా" అని  అందరూ పిలవడము జరిగినది.ఇంతకన్నా మనకు ఏమి ఉదాహరణ కావాలి...!*

Saturday, 31 August 2024

తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి






 

*తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?* 

*తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?*


*మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది.ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.*


*సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు. మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి. అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...*

Wednesday, 15 November 2023










ఓం :

అంధకారాన్ని సైతం తొలగించడానికి 
చిన్న దీపం చాలు
అలానే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం 
ఆప్యాయంగా పలకరించే ఒకడు చాలు. 




 

మృష్టాన్న భోజనం" అంటే

       మృష్టాన్న భోజనం" అంటే అంటే అన్నం ప్రధానంగా ఉండే, రుచికరమైన మరియు సంపూర్ణమైన భోజనం అని అర్థం. ఇది విటమిన్లు, కేలరీలు, ప్రోటీన్లు ...